🔸ఈ నెల 8 వరకు కొనసాగనున్న పోస్ట్ కార్డుల ఉద్యమం.
🔸షాపూర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద లాంఛనంగా ప్రారంభమైన పోస్ట్ కార్డు ఉద్యమం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వర్తింపజేస్తున్న హెల్త్ కార్డుల తరహాలో జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లా కమిటీ లాంఛనగా ప్రారంభించింది. ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం 8 తేదీ వరకు వారం రోజుల పాటు కొనసాగనుంది.ప్రతి జర్నలిస్ట్ ఓ పోస్ట్ కార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తమ డిమాండ్తో రాసి పోస్ట్ చేయాలని టీ యూ డబ్ల్యూ జే కోరుతోంది.ఈ పోస్ట్ కార్డుల ఉద్యమంలో ప్రతి మండలం, మున్సిపల్ సర్కిల్, పురపాలక సంఘం, నియోజక వర్గం,జిల్లా కేంద్రాలలోని జర్నలిస్ట్ లు భాగస్వామ్యం పంచుకోవాలని టీ యూ డబ్ల్యూ జే( హెచ్-143) మేడ్చల్ జిల్లా కమిటీ పిలుపు నిస్తోంది. ఈ సందర్భంగా టీ యూ డబ్ల్యూ జే నాయకులు షాపూర్ నగర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి, వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత స్థానిక ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద పోస్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐజేయు సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, టీ యూ డబ్ల్యూ జే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డును వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శివాజీ, జిల్లా నాయకుడు రవి కిరణ్, కుత్బుల్లాపూర్ టియుడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షుడు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, (టెంజు) అధ్యక్షుడు ఎర్రోళ్ల కృష్ణ, కుత్బుల్లాపూర్ ఉపాధ్యక్షులు బాన్సువాడ వెంకటేష్, జుట్టు సాయిలు, కార్యదర్శులు ప్రసాద్, యేర్రం శ్రీనివాస్ గుప్తా, జుట్టు యాకుబ్, పల్నాటి శివకుమార్, పాండురంగం, సభ్యులు శ్రీరామ రాజు, ఎన్. శివకుమార్, సూర్యచంద్ర, ప్రసాద్, మహేష్,మని ప్రసాద్, కామేష్ తదితర జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.