ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పాఠశాల స్థాయిలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సీఐ అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం మేడ్చల్లోని న్యూలిటిల్ లిల్లీ హైస్కూల్లో ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చైర్పర్సన్ మంజులా ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయిలో నాయకత్వ లక్షణాలు, సాంఘిక భావన నెలకొల్పాలన్న లక్ష్యంతో పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిలు ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ భావి జీవింతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుకు ధనిక, పేద అని తేడా ఉండదని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయడానికి శ్రమించాలని సూచించారు. అలాగే ఇటీవలి కాలంలో సమాజంలో ప్రబలుతున్న సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై మాట్లాడుతూ విద్యార్థులు మోబైల్ ఫోన్ అవసరం మేరకు వాడాలన్నారు. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ఫోన్ ను చేరే ఏపీకే తదితర ఫైళ్లు, గుర్తు తెలియని లింకులను తెరవద్దన్నారు. అలాంటి తెలిస్తే మూడో వ్యక్తి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి, తలిదండ్రులు చెమటోడ్చి సంపాదించిన డబ్బులను స్వాహా చేసే ప్రమాదం ఉందన్నారు. పూర్తి అవగాహన లేకుండా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ల జోలికి వెళ్లవద్దన్నారు. విద్యార్థులను పట్టిపీడిస్తున్న మరో అతి పెద్ద సమస్య డ్రగ్స్ అన్నారు. కొంత మంది సంపాదనే ధ్యేయంగా విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలను అలవాటు చేస్తున్నారన్నారు. డ్రగ్స్ కు అప్రమత్తంగా ఉండాలని, తాము వినియోగానికి దూరంగా ఉండటమే కాకుండా ఎవరైనా వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.అంతకు ముందు సీఐ అంజిరెడ్డి చైర్పర్సన్ మంజులాప్రకాష్, ప్రిన్సిపాల్ శాంతి, డైరెక్టర్ సాయిదీప్ తో కలిసి బ్యాడ్జ్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శనగరం శాంతి, బర్మా సాయిదీప్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
