RJNEWS TELUGU
Date of Publish : 31 October 2026, 8:57 am Posted by : RJ NEWS TELUGU

ఫాక్స్‌సాగర్‌కు మహర్దశ.. 2027 అక్టోబర్ నాటికి స్వచ్ఛమైన జలాశయంగా తీర్చిదిద్దుతాం: రంగనాథ్

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ఐఏఎస్ ) క్షేత్రస్థాయిలో పర్యటించారు. మంగళవారం హైడ్రా తొలగించిన అక్రమ బోరుబావులతో పాటు ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు పరిసరాల్లో అక్రమంగా నీటి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై హైడ్రా మంగళవారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫాక్స్‌సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏడు అక్రమ బోరుబావులను తొలగించడంతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న పైపులైన్లను తొలగించింది. అక్రమంగా నీటిని తరలించేందుకు వినియోగిస్తున్న వాహనాలను సైతం స్వాధీనం చేసుకుంది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ స్టిక్కర్లు ఉన్న ట్యాంకర్లను ఉపయోగించి అక్రమ నీటి వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించింది.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. 2027 అక్టోబర్ నాటికి ఫాక్స్‌సాగర్‌ను స్వచ్ఛమైన నీటితో నిండిన అందమైన సరస్సుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి నిర్మించిన ఎలాంటి కట్టడాలనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా చెరువు భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణలో భాగంగా ఆక్రమణల తొలగింపుతో పాటు అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు.