ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఆదివారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే మహిళలు వివిధ వీధుల నుంచి కూడలి వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై పెట్టుకుని, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు వెళ్లారు. భక్తి గీతాలు, కోలాటాలతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల దీపాలు, పూలతో అలంకరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. యువకులు పోతురాజు వేషాలు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కూడా చేపట్టారు. పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
