🔸అక్టోబర్ 2న కేపీహెచ్ బీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (TUWJ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కేపీహెచ్ బీ మెయిన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా పాలన మొదలై మూడేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరమని అన్నారు. గత మూడేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకోలేదని, గతంలో ఉన్న హెల్త్ స్కీంను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. అలాగే ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, వేతన బోర్డు ఏర్పాటు, జర్నలిస్టుల రక్షణ చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.