RJNEWS TELUGU
Date of Publish : 22 September 2026, 6:51 pm Posted by : RJ NEWS TELUGU

ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌ డేటా నమోదు పక్కాగా ఉండాలి

జాప్యం, తప్పిదాలకు తావివ్వొద్దు: డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్‌

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మాతా, శిశు ఆరోగ్య సేవలకు సంబంధించిన వివరాలను ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో వివరాల నవీకరణ, పర్యవేక్షణ, డేటా నాణ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత ఆరోగ్య కేంద్రాల డీఈఓలు, ఏసీసీలు, సూపర్‌వైజర్లు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. ఆనంద్‌ మాట్లాడుతూ.. గర్భిణుల మాతృ ఆరోగ్య పరామితులు, ప్రసవ వివరాలు, శిశు ఆరోగ్య సూచికలు తదితర సమాచారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిగా, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిచూసిన అనంతరం పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వివరాలను వెంటనే పూర్తి చేయడంతో పాటు, ఇప్పటికే నమోదైన సమాచారంలో తప్పులు లేదా అసంపూర్ణ వివరాలు ఉంటే పరిశీలించి సరిచేయాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో డేటా ఎంట్రీని నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని డీఈఓలు, ఏసీసీలు, సూపర్‌వైజర్లకు సూచించారు.మాతా, శిశు ఆరోగ్య సేవల పర్యవేక్షణలో ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో నమోదయ్యే సమాచారం కీలకమని డా. ఆనంద్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌ సమీక్షలు, ఉన్నతాధికారుల పరిశీలనకు ఈ వివరాలే ఆధారమవుతాయని తెలిపారు. డేటా నాణ్యత, సమగ్రత, సమయానుకూల నవీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.