RJNEWS TELUGU
Date of Publish : 19 September 2026, 8:35 pm Posted by : RJ NEWS TELUGU

ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయి తరలింపు.. దుండిగల్‌లో పట్టివేత

డీసీఎంలో 426 కిలోల గంజాయి.. ఆరుగురి అరెస్టు

రూ.2.28 కోట్ల విలువైన సరుకు స్వాధీనం.. మరో ఇద్దరు పరారీ

ఆర్.జె.న్యూస్, కుత్బుల్లాపూర్ : ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్‌ ఎస్‌వోటీ, కుత్బుల్లాపూర్‌ జోన్‌ బృందం పట్టుకున్నారు . డీసీఎం వాహనంలో తరలిస్తున్న 426 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేసారు . పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2,28,87,350 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దుండిగల్‌ సర్వీస్‌ రోడ్డులోని ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-5 వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అరెస్టయిన నిందితుల్లో సునీత (41), నానా (52), వికాస్‌ భోస్లే (34), సోము (30), రాజు చవాన్‌ (39), అరుణ్‌ బాబురావు చెండ్కే (30) ఉన్నారు. పరారీలో ఉన్నవారిలో అవినాష్‌ బాబు రాథోడ్‌, అభిజిత్‌ థాటే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సునీత ఒడిశాలోని గజపతి జిల్లా నుంచి గంజాయిని సమకూర్చుకుని, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన నిందితులతో కలిసి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని ఐచర్‌ డీసీఎం వాహనంలో తరలించగా, దానికి ముందు స్విఫ్ట్‌ కారును ఎస్కార్ట్‌ వాహనంగా ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 18న రాత్రి 8 గంటల సమయంలో దుండిగల్‌ సర్వీస్‌ రోడ్డులోని ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-5 వద్ద ఎస్ఓటి కుత్బుల్లాపూర్‌ జోన్‌ బృందం వాహనాలను తనిఖీ చేయగా గంజాయి రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డీసీఎంలో ఉన్న 426 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలతో పాటు మొబైల్‌ ఫోన్లు, కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన సునీత భర్త రాహుల్‌ గతంలోనూ ఎన్‌డీపీఎస్‌ కేసులో నిందితుడిగా ఉన్నారని, ప్రస్తుతం ఖమ్మం జైలులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి , ఎస్ఓటి పి. శోభన్‌కుమార్‌, మేడ్చల్ ఏసీపీశంకర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వారు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌వోటీ, దుండిగల్‌ పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.