🔸పెండింగ్ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం
🔸రాజీమార్గంతో వివాదాలకు ముగింపు
🔸 ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి: సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్. ప్రియాంక
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, కుటుంబ వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనేందుకు జాతీయ లోక్ అదాలత్ చక్కటి వేదిక అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్. ప్రియాంక అన్నారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టుల సముదాయం హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలు, కేసులకు రాజీమార్గంలో పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, విడాకుల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల కేసులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన పరిహార కేసులు తదితర అంశాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని జడ్జి ప్రియాంక పేర్కొన్నారు.న్యాయసేవాధికారులు, సంబంధిత కుటుంబ సభ్యుల సమక్షంలో కేసులను పరిష్కరించుకుని కోర్టు కేసుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు.పెండింగ్ కేసులకు ముగింపు పలికి ప్రశాంత జీవితానికి బాటలు వేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కుటుంబాలు, వ్యక్తుల మధ్య ఉన్న వివాదాలకు సామరస్యపూర్వక పరిష్కారం లభించడం ద్వారా సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్యతో పాటు న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.