RJNEWS TELUGU
Date of Publish : 16 August 2026, 7:58 am Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రసవ సేవలపై నిర్లక్ష్యం..!

ఆర్.జే.న్యూస్, మేడ్చల్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులను గాంధీ ఆసుపత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రసవం సమీపించిన ఓ గర్భిణీని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బోయినపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. దీంతో 108 సిబ్బంది అక్కడే ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా తరలించాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రసవ సేవలు అందించాల్సిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి గర్భిణులను వరుసగా రిఫర్‌ చేయడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రసవ సేవలు అందుబాటులో ఉన్నాయా? ఉంటే గర్భిణులను ఎందుకు గాంధీకి తరలిస్తున్నారు? లేక సేవలు అందుబాటులో లేకపోతే ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతుండగా.. మరోవైపు ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి రావడం మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రసవ సేవల్లో లోపాలుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.