RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 3:48 pm Posted by : RJ NEWS TELUGU

అధికారి కాదు.. వైద్యుడిగా మారిన డీఎంహెచ్‌వో!

🔸రోగిని స్వయంగా పరీక్షించి వైద్య సలహాలు
🔸కుషాయిగూడ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతోందనే నమ్మకాన్ని ప్రజల్లో మరింత పెంచేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కె. ఆనంద్ ప్రత్యేక చొరవ చూపారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన, కేవలం అధికారిగా తనిఖీలకే పరిమితం కాకుండా స్వయంగా వైద్యుడి పాత్రలో రోగిని పరీక్షించి అందరినీ ఆకట్టుకున్నారు.సాధారణ తనిఖీలకు భిన్నంగా డా. కె. ఆనంద్ తన అధికార హోదాను పక్కనపెట్టి రోగితో నేరుగా మాట్లాడారు. రోగి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అవసరమైన వైద్య సలహాలు అందిస్తూ తగిన మందులను సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందుతున్నాయనే సందేశాన్ని ఆయన చర్య స్పష్టంగా చాటింది.అనంతరం పీహెచ్‌సీలోని రోగుల రిజిస్టర్లు, వైద్య రికార్డులు, మందుల నిల్వలు, సేవల నిర్వహణ తదితర అంశాలను డా. ఆనంద్ క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమావేశమై రోజువారీగా రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.ప్రతి రోగికి సమయానికి వైద్యం అందాలి గౌరవంగా పలకరించాలి నాణ్యమైన సేవలు అందించాలి అని వైద్య సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని డా. కె. ఆనంద్ స్పష్టం చేశారు.