శివనామస్మరణతో మార్మోగిన క్షేత్రం.. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పరమశివుడిని దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగింది. ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.