RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 8:19 am Posted by : RJ NEWS TELUGU

సన్న వడ్ల బోనస్‌కు ఆన్‌లైన్‌ నమోదు తప్పనిసరి

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేసిన రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ అందుతుందని మేడ్చల్‌ మండల వ్యవసాయ అధికారి ఎస్‌. మాధవ రెడ్డి తెలిపారు. బోనస్‌ పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం బోనస్‌కు ఎంపిక చేసిన బీపీటీ-5204, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎల్‌ఎం-1638, జై శ్రీరామ్‌, 22-7715, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, డబ్ల్యూజీఎల్‌-44 రకాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. విత్తన డీలర్లు, షాపుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన అదే దుకాణంలో ఆన్‌లైన్‌ నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. సీడ్‌ ప్లాంట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాల నుంచి విత్తనాలు పొందిన రైతులు సంబంధిత బిల్లుల జిరాక్స్‌ ప్రతులను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ)కు అందజేయాలని పేర్కొన్నారు.సొంత వడ్లను విత్తనాలుగా వినియోగించిన రైతులు స్వీయ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి తమ పరిధిలోని ఏఈఓకు సమర్పించి నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని మాధవ రెడ్డి కోరారు.