🔸రసాయన వ్యర్థాలతో చేపలు, పశువుల మృతి
🔸పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్
ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో కొల్తూరు గ్రామంలోని కుంటలు, చెరువులు కాలుష్య కూపాలుగా మారుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నీటితో చేపలు, పశువులు, జలచరాలు, పక్షులు మృత్యువాత పడుతున్నాయన్న సమాచారంతో శుక్రవారం ఆయన కొల్తూరు చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఈటల రాజేందర్.. పారిశ్రామిక వ్యర్థాలు చెరువులు, కుంటల్లోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని, శుద్ధి చేయని నీటిని బయటకు వదిలితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.జీడిమెట్ల కెమికల్ ఇండస్ట్రియల్ ఏరియా, జీనోమ్ వ్యాలీ, తుర్కపల్లి, జవహర్‌నగర్ డంప్‌యార్డు నుంచి వస్తున్న మురుగునీరు, దుర్వాసనతో పరిసర ప్రాంతాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ఈటల అన్నారు.కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు రసాయన వ్యర్థాలను బోర్లు వేసి భూగర్భంలోకి పంపుతున్నారని, మరికొందరు డ్రైనేజీల్లోకి వదులుతున్నారని ఈటల ఆరోపించారు. దీనివల్ల చెరువుల్లోని చేపలు, వాటిని తినే కొంగలు, ఇతర పక్షులు చనిపోతున్నాయని తెలిపారు. కలుషిత నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయని పేర్కొన్నారు.కొల్తూరు గ్రామంలో జీనోమ్ వ్యాలీ నుంచి వచ్చిన రసాయన వ్యర్థాల కారణంగా సుమారు రూ.15 లక్షల విలువైన చేపపిల్లలు మృతి చెందాయని ఈటల తెలిపారు. అవి పెరిగితే సుమారు రూ.కోటి విలువైన సంపదగా మారేవని, ఈ చేపలపై దాదాపు 250 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. కళ్లముందే చేపలు మృత్యువాత పడుతుండటంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని అన్నారు.ఫార్మా పరిశ్రమల వల్ల ఉపాధి లభిస్తుందని ఆశించిన స్థానికులకు కాలుష్యం కారణంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోందని ఈటల అన్నారు. వైద్య ఖర్చులు పెరిగి సంపాదనలో అధిక భాగం ఆసుపత్రులకే ఖర్చవుతోందని పేర్కొన్నారు.ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం, నిబంధనలు ఉన్నప్పటికీ రసాయన వ్యర్థాలను అరికట్టలేకపోవడం బాధాకరం అని ఈటల అన్నారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠినంగా వ్యవహరించాలనీ,అవసరమైతే ఈ సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటాం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.