RJNEWS TELUGU
Date of Publish : 29 September 2026, 9:35 am Posted by : RJ NEWS TELUGU

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..! విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్ జిల్లాలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అధికారులు పాల్గొని ఆయా కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

బస్తీ, పల్లె దవాఖానాలపై దృష్టి

బస్తీ, పల్లె దవాఖానాల సేవలను మరింత మెరుగుపరచాలని డా. ఆనంద్‌ సూచించారు. ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత వేళల్లో ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.

మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని ఆదేశించారు. బాలికలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని విద్యాశాఖతో సమన్వయం చేసుకుని అర్హులైన విద్యార్థులందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన టీకాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

క్షయ, కుష్ఠు వ్యాధులపై నిఘా

క్షయ వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని డా. ఆనంద్‌ ఆదేశించారు. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డీబీటీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలని, అనుమానిత కేసులను త్వరగా గుర్తించి చికిత్స అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

అంటువ్యాధులపై నిరంతర నిఘా

జిల్లాలో వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ అంటువ్యాధులపై నిరంతర నిఘా ఉంచి అనుమానిత కేసులను సకాలంలో గుర్తించి, సమాచారాన్ని వెంటనే నమోదు చేయడంతో పాటు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

అసాంక్రమిక వ్యాధుల గుర్తింపునకు ప్రాధాన్యం

అధిక రక్తపోటు, మధుమేహం తదితర అసాంక్రమిక వ్యాధులను ముందుగానే గుర్తించి పరీక్షలు, చికిత్స, తదుపరి పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఉపకేంద్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డా. కె. ఆనంద్‌ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంపై జిల్లా కార్యాలయానికి సమాచారం అందితే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సిబ్బంది కొరతకు త్వరలో పరిష్కారం

జిల్లాలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని డా. ఆనంద్‌ తెలిపారు. ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా అవసరమైన మానవ వనరులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరంగా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డా. ఆనంద్‌ సూచించారు.