RJNEWS TELUGU
Date of Publish : 10 September 2026, 8:59 pm Posted by : RJ NEWS TELUGU

మెడినోవాలో అరుదైన వైద్య చికిత్స..! 6.2 కిలోల అండాశయ కణతి తొలగింపు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మెడినోవా వైద్యశాలలో గురువారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 58 ఏళ్ల మహిళ పొత్తికడుపులో ఉన్న 6.2 కిలోల భారీ అండాశయ కణతిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మెదక్ జిల్లా గాంధారిపల్లికి చెందిన మహిళ మూడు నెలలుగా కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించగా పొత్తికడుపులో భారీ అండాశయ కణతి ఉన్నట్లు గుర్తించారు.కణతి పొత్తికడుపు నుంచి పైభాగం వరకు విస్తరించడంతో పాటు పరిసర అవయవాలకు అంటుకుని ఉండటంతో శస్త్రచికిత్స క్లిష్టంగా మారింది. పరీక్షల్లో ఆమె గుండె సంబంధిత సమస్యతోనూ బాధపడుతున్నట్లు తేలింది. అయినప్పటికీ వైద్య బృందం సవాలుగా తీసుకుని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. గైనకాలజిస్టు డా. సోనియా రెడ్డి, జనరల్ సర్జన్ డా. మనోజ్‌కుమార్, అనస్థీషియా వైద్యులు డా. మాధవ్‌రెడ్డి, డా. శిరీష ఆధ్వర్యంలోని బృందం 6.2 కిలోల భారీ సీరస్ సిస్టాడెనోమా కణతిని తొలగించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.