ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నవ భారత సాక్షరతా కార్యక్రమం ‘ఉల్లాస్’ కింద చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లా కార్యక్రమాలను అభినందించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వాటి వివరాలతో కూడిన వ్యాసాన్ని కోరగా, అధికారులు పంపిన సమాచారాన్ని ఆదివారం తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ప్రచురించింది.
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మార్గదర్శకత్వంలో జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మున్సిపల్ సర్కిళ్లలో రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అక్షరాస్యత లేని వారిని గుర్తించి ఉల్లాస్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.స్వచ్ఛంద ఉపాధ్యాయులు, అభ్యాసకులను భారీ సంఖ్యలో నమోదు చేయడం ద్వారా అక్షరాస్యత పెంపునకు కృషి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జిల్లా, రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలోనే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. అనిత తెలిపారు.