RJNEWS TELUGU
Date of Publish : 24 September 2026, 10:16 pm Posted by : RJ NEWS TELUGU

నకిలీ పత్రాలతో స్థలాల రిజిస్ట్రేషన్‌

🔸ముగ్గురు అరెస్టు.. మరో నలుగురు పరారీ

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : నకిలీ గుర్తింపు పత్రాలతో అసలు యజమానిగా మరొక మహిళను సృష్టించి స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో ముగ్గురిని జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యెల్లారెడ్డిగూడలోని కృష్ణారెడ్డినగర్‌ కాలనీలో ప్లాట్‌ నంబర్లు 167, 168కు సంబంధించిన వ్యవహారంపై యజమాని తండ్రి డి. కిషోర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.అమెరికాలో నివసిస్తున్న అసలు యజమాని మానసారావు ఆగస్టు 31న భారత్‌లో లేనప్పటికీ.. ఆమె స్థానంలో మరో మహిళను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, కాప్రా వద్ద హాజరుపరిచి నకిలీ, కల్పిత గుర్తింపు పత్రాలతో స్థలాలను ఏ-3, ఏ-4 పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తులో అసలు టైటిల్‌ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించారు.రూ.62.13 లక్షల లావాదేవీవిశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి బీగుడెం అరవింద్‌ అలియాస్‌ టిల్లు, దంతూరి భాస్కర్‌గౌడ్‌, ఆకుల సూరిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొబైల్‌ఫోన్లు, ప్లాట్‌లకు సంబంధించిన అసలు రిజిస్ట్రేషన్‌, టైటిల్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లావాదేవీలో సుమారు రూ.62.13 లక్షల విక్రయ మొత్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగదు లావాదేవీలు, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, గుర్తింపు పత్రాలు, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.మరో నలుగురు పరారీ. కేసులో సుకుమార్‌రెడ్డి, నజీర్‌, అనుపమ అలియాస్‌ మానస, శ్రవణ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురిని గురువారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు