RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 3:46 pm Posted by : RJ NEWS TELUGU

పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కరువు

🔸ఎనిమిది నెలలుగా గ్లౌస్‌లు, చీపుర్లు అందడం లేదంటూ ధర్నా
🔸గుండ్లపోచంపల్లి డివిజన్‌లో కార్మికుల ఆందోళన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : నగరం నిద్ర లేవకముందే వీధులు, రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస భద్రతా సదుపాయాలే కరువయ్యాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన చేతి గ్లౌస్‌లు, చీపుర్లు, సబ్బులు తదితర అవసరమైన వస్తువులు గత ఎనిమిది నెలలుగా అందడం లేదని ఆరోపిస్తూ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బుధవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు.ఈ ఆందోళనకు మేడ్చల్ జిల్లా భాజపా నాయకుడు అమరం మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రోడ్లు ఊడ్చేందుకు అవసరమైన చీపుర్లు, మురుగు శుభ్రం చేసేందుకు చేతి గ్లౌస్‌లు, వ్యక్తిగత పరిశుభ్రత కోసం సబ్బులు, నూనె, బెల్లం వంటి వసతులు కూడా తమకు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ సైబరాబాద్ కార్పొరేషన్‌లో విలీనం అయినప్పటికీ తమ వేతనాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదని కార్మికులు ఆరోపించారు. ఇప్పటికీ మున్సిపల్ పాలనలో అందించే స్థాయి వేతనాలనే చెల్లిస్తున్నారని, అందులోనూ పన్నుల పేరుతో ప్రతి నెల రూ.500 వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేస్తున్న తమకు కనీస భద్రతా పరికరాలు కూడా అందకపోవడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అవసరమైన భద్రతా సామగ్రి, పారిశుద్ధ్య పరికరాలు అందించడంతో పాటు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.