RJNEWS TELUGU
Date of Publish : 08 July 2026, 5:12 pm Posted by : RJ NEWS TELUGU

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్..! గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు.. నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 8 :

మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సర్వర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ సేవలు గంటలపాటు నిలిచిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విక్రయ ఒప్పందాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) తదితర సేవల కోసం ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సర్వర్ పనిచేయకపోవడంతో టోకెన్లు తీసుకున్న వారు, ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారి పనులు పూర్తికాక నిరాశతో వెనుదిరిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమయం, ప్రయాణ వ్యయం వృథా అయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన కొనుగోలుదారులు, విక్రేతలు, డాక్యుమెంట్ రైటర్లు, న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు కూడా సర్వర్ సమస్యతో పనులు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రిజిస్ట్రేషన్లు వాయిదా పడటంతో ఆర్థిక లావాదేవీలు ఆలస్యమైనట్లు తెలిపారు.సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులకు సమాచారం అందించామని, సేవలను త్వరితగతినపునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. సర్వర్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.