RJNEWS TELUGU
Date of Publish : 02 October 2026, 10:22 am Posted by : RJ NEWS TELUGU

మైనర్‌పై లైంగిక దాడి.. పెళ్లి పేరుతో మోసం

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 17 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలిక తరచూ జీడిమెట్లలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చేది. ఏడాది క్రితం ఓ పండుగ సందర్భంగా స్థానిక బేకరీలో పనిచేసే చింతల్‌ అంబేద్కర్‌నగర్‌కు చెందిన మధు (22) తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ మధు తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. బాలిక జీడిమెట్లకు వచ్చినప్పుడల్లా కలిసేవాడు. గతేడాది మార్చి, మే, జూన్‌ నెలల్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాట్లాడాలంటూ బాలికను తన ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్న కుటుంబసభ్యులు. ఇటీవల బాలిక ఫోన్‌ను పరిశీలించిన ఆమె పిన్ని, మధుతో సాగుతున్న సంభాషణలపై అనుమానం వ్యక్తం చేశారు. బాలికను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు మధుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.