RJNEWS TELUGU
Date of Publish : 30 September 2026, 9:19 pm Posted by : RJ NEWS TELUGU

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలను స్వీకరించి, వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.బుధవారం కూకట్‌పల్లి మండలం ప్రగతినగర్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ మను చౌదరితో కలిసి సీఈఓ పరిశీలించారు. ఓటు నిర్ధారణ ప్రక్రియ, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, రికార్డుల పరిశీలన తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు.బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని, సూపర్‌వైజర్లు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. స్వీకరించిన పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. బీఎల్‌ఓలు అప్‌లోడ్‌ చేస్తున్న విధానాన్ని సీఈఓ పరిశీలించారు. ఎక్కువగా ఏ ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తున్నారని అడగగా.. ఎస్‌ఎస్‌సీ మెమో, పాస్‌పోర్టు పత్రాలను ఎక్కువగా అందజేస్తున్నట్లు బీఎల్‌ఓలు తెలిపారు.అర్హులైన ఓటర్ల వివరాలు క్రమపద్ధతిలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా తగిన సిబ్బందిని నియమించి, రోజువారీ లక్ష్యాలతో పనిచేయాలని ఆదేశించారు. హియరింగ్‌లు, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మయాంక్‌సింగ్‌, తహసీల్దార్‌ అశోక్‌, డిప్యూటీ కమిషనర్‌, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.