RJNEWS TELUGU
Date of Publish : 15 August 2026, 9:21 pm Posted by : RJ NEWS TELUGU

మహిళల పేరుతోనే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌: కుటుంబంలోని మహిళ పేరు మీదే భౌతిక, డిజిటల్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. శనివారం శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ వేద్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామ, మున్సిపాలిటీ, వార్డు స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల అవసరాలను తెలుసుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.జిల్లాలో ఇప్పటివరకు 1,39,622 కొత్త రేషన్‌ కార్డుల ద్వారా లబ్ధిదారులు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పొందుతున్నారని తెలిపారు. ప్రతి నెల సుమారు 14 నుంచి 15 వేల టన్నుల సన్నబియ్యాన్ని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోనూ సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.స్మార్ట్‌ రేషన్‌ కార్డు ముందు భాగంలో కార్డు నంబర్‌, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్‌ షాప్‌ నంబర్‌ ఉంటాయని, వెనుక భాగంలో మండలం, జిల్లా, రాష్ట్ర చిరునామాతోపాటు క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ‘టీ-రేషన్‌’ మొబైల్‌ యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, తీసుకున్న రేషన్‌ పరిమాణం, రేషన్‌ షాప్‌ వివరాలు తదితర సమాచారం తెలుసుకోవచ్చన్నారు. భౌతిక కార్డు వెంట లేకపోయినా మొబైల్‌లోని డిజిటల్‌ రేషన్‌ కార్డులోని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రేషన్‌ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ చైర్మన్‌ నర్సింహులు యాదవ్‌, గ్రంథాలయ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ కమిటీ సభ్యుడు జైపాల్‌రెడ్డి, టీజీఎల్‌డీఏ చైర్మన్‌ చరణ్‌ కౌశిక్‌, ఎల్లంపేట్‌, అలియాబాద్‌, మూడుచింతలపల్లి మున్సిపల్‌ చైర్మన్లు, కీసర ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.