RJNEWS TELUGU
Date of Publish : 23 September 2026, 7:20 pm Posted by : RJ NEWS TELUGU

మందుల నిల్వలపై ప్రత్యేక పర్యవేక్షణ

మెడిపల్లి యూపీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మెడిపల్లి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్‌ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసిన ఆయన.. త్వరలో గడువు ముగియనున్న మందుల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. వాటి వినియోగం, స్టాక్‌ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగుల హాజరు, రికార్డుల నిర్వహణ, ల్యాబొరేటరీ సేవలు, మాతా–శిశు ఆరోగ్య సేవలను పరిశీలించారు. యూపీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనుకూలమైన ప్రాంతంలో యూపీహెచ్‌సీ ఏర్పాటు

స్థానిక ప్రజాప్రతినిధులు యూపీహెచ్‌సీని ప్రజలకు మరింత అందుబాటులో ఉండే అనుకూలమైన ప్రదేశానికి మార్చాలని డీఎంహెచ్‌ఓను కోరారు. దీనిపై స్పందించిన డా. కె. ఆనంద్‌.. ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందేలా అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఎన్‌సీడీ సేవలపై ప్రత్యేక దృష్టి

రక్తపోటు, మధుమేహం తదితర అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌, నమోదు, చికిత్స, ఫాలోఅప్‌ వివరాలను సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. యూపీహెచ్‌సీ పరిధిలో అమలు కావాల్సిన అన్ని ఆరోగ్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డా. ఆనంద్‌ సూచించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు నాణ్యతా ప్రమాణాలతో కూడినవేనని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఉచిత మందులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికీ సమర్థవంతమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.