RJNEWS TELUGU
Date of Publish : 25 November 2026, 7:13 pm Posted by : RJ NEWS TELUGU

పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు : ఆకాష్ కొల్లూరు

🔸యువత, పట్టభద్రులు రాజకీయాల్లోకి రావాలి.. స్వచ్ఛమైన పాలన అందించడమే లక్ష్యం

ఆర్ జె న్యూస్, సికింద్రాబాద్ : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకాష్ కొల్లూరు, పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పద్మిని హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ డా. రఘు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి సురభి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆకాష్ కొల్లూరు మాట్లాడుతూ.. జర్నలిజం రంగంలో తనకున్న అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన, సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి పార్టీ అధ్యక్షురాలు తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు.

దేశ రాజకీయాల నుంచి క్షేత్రస్థాయిలోని గల్లీ రాజకీయాల వరకు పరిశీలించిన అనుభవం తనకుందని, నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పేద ప్రజల కష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. యువత, పట్టభద్రులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లో ముందడుగు వేసినట్లు వివరించారు.

అవినీతి రాజకీయాలకు స్వస్తి పలికి, స్వచ్ఛమైన పాలన అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని కవాడిగూడలో పుట్టి పెరిగిన తనకు ఈ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో పాటు, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడిగా తనను ఆదరించి, పట్టభద్రులు, యువత ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆకాష్ కొల్లూరు విజ్ఞప్తి చేశారు.