RJNEWS TELUGU
Date of Publish : 07 August 2026, 11:08 pm Posted by : RJ NEWS TELUGU

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం: ఈటల రాజేందర్

🔸ఢిల్లీలో అగ్రనాయకత్వంతో సమీక్ష – రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఆర్.జె.న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జాతీయ అధిష్ఠానం రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

🔸మోదీ, అమిత్ షా, నడ్డా ప్రత్యేక దృష్టి

తెలంగాణలో బీజేపీని గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని ఈటల తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని తెలంగాణకు వచ్చారని గుర్తుచేశారు. “ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కృషి చేస్తున్నారు. వారు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేశారు” అని అన్నారు. బెంగాల్‌లో సాధించిన విజయాన్ని తెలంగాణలోనూ సాధించాలనే సంకల్పంతో అధిష్ఠానం పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.

🔸 రేవంత్, కేసీఆర్ ప్రభుత్వాలపై విమర్శలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈటల ఆరోపించారు. గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసి ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. “అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈసారి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు” అని అన్నారు. అదే సమయంలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలన, అహంకారం, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇంకా ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయని విమర్శించారు. “కాబట్టి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు” అని ధీమా వ్యక్తం చేశారు.

🔸అప్పుల ఊబిలో రాష్ట్రం..!

అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను కాపాడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఈటల అన్నారు. దోపిడీ, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే బీజేపీ బలపడాల్సిందేనని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. పాన్ షాపుల వద్ద, హోటళ్ల వద్ద, చౌరస్తాల్లో ప్రతిచోటా తెలంగాణ రాజకీయాలపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

🔸ప్రజా సమస్యలపై పోరాటం..!

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య, రైతుల సమస్యలు, అసైన్డ్ భూముల సమస్య, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు వంటి అంశాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు నాయకత్వం వహించడం, ప్రజల్లో భరోసా కల్పించడం తమ బాధ్యత అని బీజేపీ నాయకులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాబోయే రోజుల్లో నాయకులంతా ఐక్యంగా కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పార్టీ పెద్దలు సూచించారని ఈటల వెల్లడించారు.