RJNEWS TELUGU
Date of Publish : 08 August 2026, 9:44 pm Posted by : RJ NEWS TELUGU

విద్యుత్‌ సరఫరా నిలిపి.. వృద్ధురాలి మెడలోని తాళిబొట్టు చోరీ

🔸 ఇంట్లోకి చొరబడి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు

🔸 రావల్‌కోల్‌లో వరుస చోరీలతో కలకలం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్‌ పరిధిలోని రావల్‌కోల్‌ గ్రామంలో చోరీలు, చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంటి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడలోని తాళిబొట్టును లాక్కెళ్లాడు. రావల్‌కోల్‌కు చెందిన తరిగొప్పుల కుమారి రాజమణి (60), భర్త సత్తయ్య, వృత్తిరీత్యా కుండలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తి లక్ష్యంగా చేసుకున్నాడు. ముందుగా ఇంటి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి లోపలికి ప్రవేశించిన దుండగుడు.. ఆమె మెడ పట్టుకుని బెదిరించి రోల్డ్‌గోల్డ్‌ గొలుసుతో పాటు సుమారు 3 గ్రాముల బంగారు పుస్తెను లాక్కెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

🔸 వరుస ఘటనలతో ఆందోళన

రావల్‌కోల్‌లోనే బండెల నర్సమ్మ, ఇందిరమ్మ కాలనీ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. అలాగే ఎల్లంపేట్ లోని నగల దుకాణం పక్కన దుండిగల్ల సందీప్‌రెడ్డి ఇంట్లోనూ చోరీ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. మరో ఘటనలో రూ.2 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఒకే ప్రాంతంలో వరుసగా చోరీలు, చైన్‌స్నాచింగ్‌ ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దుండగుల కదలికలపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.