RJNEWS TELUGU
Date of Publish : 18 August 2026, 4:09 pm Posted by : RJ NEWS TELUGU

ఎస్‌ఐపై చేయిచేసుకున్న యువకుడు..! పోలీసు విధులకు ఆటంకం.. ఇద్దరికి రిమాండ్

ఆర్.జె.న్యూస్, అల్వాల్ : బోనాల బందోబస్తులో ఉన్న పోలీసు ఎస్‌ఐపై చేయిచేసుకున్న ఘటన ఆల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఎంజీ నగర్‌లోని భూలక్ష్మమ్మ ఆలయం వద్ద ఎస్‌ఐ దేవేందర్‌ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవపడుతుండటంతో వారిని శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే మీసాల సంతోష్‌ అనే యువకుడు ఆగ్రహంతో ఎస్‌ఐ దేవేందర్‌పై చేయిచేసుకుని ఎడమ చెంపపై రెండుసార్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో జారిపోతుల దీపక్‌ అడ్డుపడి ఎస్‌ఐ చేతిని బలంగా పట్టుకుని, సంతోష్‌ను పోలీసుల అదుపు నుంచి విడిపించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.అనంతరం పోలీసు సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.ఎస్‌ఐ దేవేందర్‌ ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.