RJNEWS TELUGU
Date of Publish : 03 November 2026, 6:40 am Posted by : RJ NEWS TELUGU

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు

🔸అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశం

🔸147 దరఖాస్తుల స్వీకరణ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 147 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల అర్జీలకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.