🔸హైడ్రా కమీషనర్ రంగనాథ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నల్ల మల్లారెడ్డి కేసు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ హైడ్రా కమీషనర్ ఏ.వి. రంగనాథ్ పై నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ నల్ల మల్లారెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అకారణంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.శుక్రవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి దివ్యానగర్‌లో మీడియాతో మాట్లాడిన నల్ల మల్లారెడ్డి, 2025 జనవరి 25న హైడ్రా అధికారులు తన ఇళ్లు, పొలాలు, అసోసియేషన్ గోడలను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో తాను కట్టిన నాలుగు కిలోమీటర్ల గోడను కూల్చామంటూ హైడ్రా కమీషనర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తాను ఆక్రమించిన 2200 ప్లాట్లను రిలీజ్ చేశామని, రూ.100 కోట్ల విలువైన 6.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామంటూ తన ఫోటోతో సహా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా నా పరువు తీశారు. రంగనాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో లీగల్ యాక్షన్ తప్పదు. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లడానికైనా సిద్ధం” అని నల్ల మల్లారెడ్డి హెచ్చరించారు. తనపై వ్యక్తిగత దుష్ప్రచారం వెనుక ఎవరి హస్తం ఉందో వదిలిపెట్టేది లేదని, దీనిపై తగిన విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.