RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 9:34 pm Posted by : RJ NEWS TELUGU

టెన్త్ చదివి డాక్టర్లమయ్యారు..!

🔸అమాయకుల ప్రాణాలతో చెలగాటం
🔸సైబరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు
🔸ఏకకాలంలో 10 ఫేక్ క్లినిక్‌లపై దాడులు.. 10 మంది అరెస్ట్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తెల్లకోటు వేసుకుంటే డాక్టర్లు అయిపోతామనుకున్నారో ఏమో..! టెన్త్, ఇంటర్, బీకాం వంటి సాధారణ విద్యార్హతలతోనే ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు చికిత్స చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్నపిల్లలకు సైతం చికిత్స అందిస్తూ, రోగులకు సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న నకిలీ డాక్టర్ల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో 10 నకిలీ క్లినిక్‌లపై ఎస్‌వోటీ పోలీసులు, వైద్య శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేసులో 10 మంది నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నకిలీ క్లినిక్‌ల దందా సాగుతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక నిఘా పెట్టి దాడులు నిర్వహించినట్లు తెలిపారు.పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్‌చెరు, ఆర్సీ పురం తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న నకిలీ క్లినిక్‌లను గుర్తించారు. సరైన వైద్య పరిజ్ఞానం లేకుండానే కొందరు వ్యక్తులు డాక్టర్లుగా చెలామణి అవుతూ రోగులకు వైద్యం అందిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
🔸బెడ్లు.. సెలైన్లు.. చిన్నారులకు చికిత్స..!
నకిలీ క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నపిల్లలకు సైతం చికిత్స అందిస్తూ, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు వెల్లడైంది. దాడుల సందర్భంగా బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు, గ్లూకోజ్ పరికరాలు, సిరంజీలు, వివిధ మందులతో పాటు గడువు ముగిసిన ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
🔸ప్రాణాలతో ఆటలు వద్దు.. పోలీసుల హెచ్చరిక
నకిలీ డాక్టర్ల వద్ద చికిత్స పొందడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని డీసీపీ కోటి రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి అక్రమ వైద్య దందాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సర్టిఫికెట్లు, సరైన వైద్య అర్హతలు ఉన్న డాక్టర్ల వద్ద మాత్రమే చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. తమ చుట్టుపక్కల ఎవరైనా నకిలీ డాక్టర్లు లేదా అక్రమ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసితే వెంటనే పోలీసులకు లేదా వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.