ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రపంచ రికార్డులే లక్ష్యంగా ముందుకు సాగుతోంది 12 ఏళ్ల రుంకు వైష్ణవి. భక్తి, కళను మేళవించి వినూత్న నృత్య ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. 12 ఏళ్ల వయసులో 12 కిలోమీటర్ల నాన్‌స్టాప్ కూచిపూడి వాకథాన్ నిర్వహించడంతో పాటు, 12 ప్రపంచ రికార్డులు సాధించాలనే సంకల్పంతో వైష్ణవి సిద్ధమైంది. ఇందులో భాగంగా 122 రకాల గణపతి భంగిమలు, 522 గణేశ గీతాలతో నృత్య ప్రదర్శన ఆదివారం ప్రదర్శించింది . ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా తన నృత్య ప్రతిభను చాటుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాయి కృష్ణ, సాయి కుమారి దంపతుల కుమార్తె అయిన వైష్ణవి, ప్రముఖ కూచిపూడి గురువు డాక్టర్ ఎన్. రవికుమార్ వద్ద శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువు మార్గదర్శకత్వంలో నిరంతర సాధన చేస్తూ ఈ అరుదైన లక్ష్య సాధనకు కృషి చేసింది . కొంపల్లిలోని పీర్సన్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ ఉపాధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, నటుడు తనీష్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి వైష్ణవిని ఆశీర్వదించారు. చిన్న వయసులోనే కళపై అంకితభావం, భక్తితో కూడిన నృత్య సాధనతో ముందుకు సాగుతున్న వైష్ణవి ప్రతిభను అతిథులు, పలువురు అభినందించారు. ఆమె ప్రపంచ రికార్డుల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు.
