RJNEWS TELUGU
Date of Publish : 01 September 2026, 4:10 pm Posted by : RJ NEWS TELUGU

14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు సీఎంకు ఎందుకు భయం..? – ఆర్. కృష్ణయ్య

ఆర్.జె.న్యూస్, రామంతపూర్ : రాష్ట్రంలో 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు భయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. మంగళవారం రామంతపూర్ లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు జల్లపల్లి అంజి నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ఫీజు బకాయిలు రూ. 8 వేల కోట్లు చెల్లించడానికి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో చదువు చాలా ముఖ్యమని ప్రకటిస్తున్నారే తప్ప, ఆచరణలో చదువులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా, ఫీజులు చెల్లించకుండా విద్యార్థులు చదువు కొనసాగించకుండా అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన 18 మంది ముఖ్యమంత్రులలో ఎవరూ కూడా ఇలాంటి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా రూ. 8 వేల కోట్ల ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.