🔸రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవు.. విదేశీ నిధులతో కుట్రలు
🔸ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేయొద్దు.. కాంగ్రెస్‌పై ఈటల ధ్వజం
🔸ఆలయాలు, పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోం.. డంపింగ్ యార్డుపై పోరు ఆగదు
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, జాతీయ సమగ్రత, భారతదేశ ప్రతిష్ఠను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఆడుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్యానించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (అర్బన్) కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సంఘంపై దుష్ప్రచారం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీజేపీ కొత్తగా ప్రారంభించలేదని, 1952 నుంచే అమల్లో ఉందని ఈటల తెలిపారు. ఇప్పటివరకు 13 సార్లు ఈ ప్రక్రియ జరిగిందన్నారు. మరణించినవారు, వలస వెళ్లినవారు, చిరునామా మారినవారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నవారి వివరాలను సరిచేయడమే దీని ఉద్దేశమని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 39 లక్షల ఓట్లు ఉండగా, సుమారు 13 లక్షల ఓట్లు తొలగించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కావని స్పష్టం చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గెలిచినప్పుడు ఈవీఎంలు సరిగానే పనిచేశాయా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఎన్నికల సంఘం ప్రతిష్ఠను దిగజార్చడం సరికాదన్నారు.
రాహుల్‌పై విమర్శలు
విదేశీ నిధులతో కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉద్యమాల పేరుతో దేశంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల ఆరోపించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాల పరిణామాలను ఉదాహరణగా చూపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిని చూసి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని విమర్శించారు.
అమిత్ షా పాదయాత్రకు పిలుపు
సోమవారం నిర్వహించనున్న మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఎల్బీ స్టేడియం సమీపంలోని నిజాం కళాశాల ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమై మొజంజాహీ మార్కెట్ వరకు యాత్ర కొనసాగుతుందని వివరించారు. మేధావులు, విద్యార్థులు, యువత, దేశభక్తులు పార్టీలకు అతీతంగా పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
డంపింగ్ యార్డుపై పోరు ఆగదు
కుత్బుల్లాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై మాట్లాడుతూ.. దాని వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఈటల ఆరోపించారు. ఈ సమస్యపై తాను పోరాడటం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారని, ఎన్జీటీలో కేసు దాఖలైందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డును తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఆలయాల కూల్చివేతపై ఆగ్రహం
ఫాక్స్ సాగర్ పరిధిలోని ఆలయాల కూల్చివేతపై స్పందిస్తూ.. చెరువులను పరిరక్షించాలి కానీ ఆ పేరుతో దేవాలయాలు, పేదల ఇళ్లను కూల్చకూడదని అన్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఫాక్స్ సాగర్ కట్ట కింద సుమారు 18 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. హైడ్రా పెద్దల అక్రమ నిర్మాణాలను వదిలి పేదలపై ప్రతాపం చూపుతోందని విమర్శించారు. ఎల్లమ్మబండ, షాంషీగూడ, ఐడీఎల్ ప్రాంతాల్లోని భూముల వ్యవహారాలపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హానర్ హోమ్స్ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పెద్దల ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆస్తులు, చెరువులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్దన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ రావు, డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, జేకే శేఖర్ యాదవ్, శ్రీనాథ్, వీకే మహేష్, గరిగె శేఖర్ ముదిరాజ్, సౌరబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
