బాధ్యులపై చర్యలకు ఆదేశం.. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, పీఎం ఆవాస్ ద్వారా ఇళ్లు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు సఫాయి కార్మికులు మృతి చెందిన ఘటనపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి పరిధిలోని దీపక్ హారిక్ రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన ఘటనాస్థలాన్ని కమిషన్ సభ్యుడు కరం సింగ్ కర్మా, జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీపీ కోటిరెడ్డితో కలిసి సందర్శించి ప్రమాద పరిస్థితులను సమీక్షించారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా షణ్ముఖరావు అలియాస్ సుమన్ (26), సురేష్ గజింగి (24), పవన్ (20) మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ సరైన భద్రతా పరికరాలు, యంత్రాలు లేకుండా కార్మికులను సెప్టిక్ ట్యాంకుల్లోకి దింపి పనులు చేయించడం అత్యంత దారుణమని కమిషన్ సభ్యుడు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ లేని, శిక్షణ పొందని ప్రైవేట్ ఏజెన్సీలకు తక్కువ ఖర్చుతో పనులు అప్పగించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యులపై ఎఫ్ఐఆర్కు ఆదేశం..
ఘటనకు బాధ్యులైన ప్రైవేట్ కంపెనీ వ్యవస్థాపకుడు లేదా చైర్మన్ రవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరఫున చెక్కులు లేదా బ్యాంకు ఖాతాల ద్వారా తక్షణ పరిహారం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, పీఎం ఆవాస్ యోజన ద్వారా సొంత ఇళ్లు కల్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడంతోనే సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. బాచుపల్లి పరిధిలోని సుమారు 255 సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి కార్మికుల కనీస వేతనాలు, సెప్టిక్ ట్యాంక్ భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ మను చౌదరిని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్థానికంగా నివసిస్తున్న మృతుడు సురేష్ గజింగి కుటుంబాన్ని కమిషన్ సభ్యుడు పరామర్శించి, సురేష్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని, ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కమిషన్ సభ్యుడు పరిహార చెక్కులు అందజేశారు. ఈ పర్యటనలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకెష్ కుమార్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, బాచుపల్లి డీసీ షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

