🔸ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌వో డాక్టర్ కె. ఆనంద్ హెచ్చరిక
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ హెచ్చరించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆయన అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్యం, గర్భిణుల సంరక్షణ, ప్రసవ సేవలు, చిన్నారుల టీకాలు, క్షయ వ్యాధి గుర్తింపు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత సమయంలో వైద్య పరీక్షలు, ఫాలో-అప్‌లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.టీకాలకు దూరమైన చిన్నారులను గుర్తించి వారికి వ్యాక్సిన్లు వేయించాలని, టీబీ బాధితులను గుర్తించి సకాలంలో నమోదు చేయాలని తెలిపారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల గుర్తింపు, చికిత్స, తదుపరి పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఆన్‌లైన్ నమోదు, నివేదికలను ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రోగుల సంరక్షణలో నిర్లక్ష్యం చేసినట్లు తేలితే అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

