🔸కలెక్టర్ గుర్తించిన నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన
🔸క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి సయాని
ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశానవాటిక ప్రాంతంలో వ్యర్థాల నిర్వహణపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి ట్రాన్స్ఫర్ స్టేషన్ను మరో ప్రాంతానికి తరలించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి గుర్తించిన నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యురాలు విజయభారతి సయాని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాటుకు ఆయా స్థలాల అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, పరిసర ప్రాంతాల స్థితిగతులను ఆమె పరిశీలించారు. ప్రస్తుత ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిస్థితులు, తరలింపు ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆమెకు వివరించారు.హిందూ శ్మశానవాటిక ప్రాంతంలో వ్యర్థాల నిర్వహణపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసే అంశంపై సమీక్షించారు. నాలుగు స్థలాలను స్వయంగా పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు ప్రతిపాదిత తరలింపునకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, అదనపు కమిషనర్ (హెల్త్ అండ్ శానిటేషన్) సి.ఎన్. రఘు ప్రసాద్, ఆర్డీఓలు వెంకట్రెడ్డి, శ్యాంప్రకాష్, తహసీల్దార్లు రాములు, మతిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
