ఆర్.జె.న్యూస్, మేడ్చల్: భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీసర్వేకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మేడ్చల్ మండలం కిష్టాపూర్‌లో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. జిల్లాలో మొత్తం 11 గ్రామాల్లో భూభారతి భూముల రీసర్వే జరుగుతోందని తెలిపారు. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో మూడు గ్రామాల చొప్పున, మూడుచింతలపల్లి, శామీర్‌పేట్ మండలాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే వివరాలను మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ అదనపు కలెక్టర్‌కు వివరించారు.
