ఆర్ జె న్యూస్, హైదరాబాద్ :
ఎల్బీ నగర్ పరిధిలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య స్వయంగా రంగంలోకి దిగి ఎన్టీఆర్ నగర్లోని బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలను ఏసీపీ కృష్ణయ్య బృందం తనిఖీ చేసింది. తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో సంబంధిత బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తదుపరి చర్యలకు ఆబ్కారీ శాఖకు అప్పగించారు.
♦️ఉపేక్షించబోమని హెచ్చరిక
అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏసీపీ కృష్ణయ్య హెచ్చరించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
