ఆర్.జె.న్యూస్,గుండ్లపోచంపల్లి : గుండ్లపోచంపల్లి డివిజన్ కండ్లకోయలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. కండ్లకోయలో గ్రామ దేవతలకు బోనాల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆదివారం పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ దేవతలకు బోనాల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, కండ్లకోయ మాజీ సర్పంచ్ స్వామి తదితరులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాలు ఒక భాగం అన్నారు. అమ్మవారిని రోగాలు దరిచేరకుండా, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించే సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. దైవ కార్యక్రమాలు ప్రజల్లో సహకార భావాన్ని పెంపొందించడం తో పాటు ఆధ్యాత్మికతో ఎనలేని ఆత్మసంతృప్తిని ఇస్తాయన్నారు.
