Thursday, November 5, 2026
Homeమేడ్చల్ జిల్లాచేపల మృత్యువాతతో ఏదులాబాద్ చెరువును సందర్శించిన...

చేపల మృత్యువాతతో ఏదులాబాద్ చెరువును సందర్శించిన ఏనుగు సుదర్శన్‌రెడ్డి.

📰 Generate e-Paper Clip

🔸మత్స్యకారుల అండగా ఈటల దృష్టికి సమస్య.. పరిష్కారానికి చొరవ

ఆర్ జె న్యూస్, ఘట్‌కేసర్‌ : కలుషిత నీటితో చేపలు మృత్యువాత పడుతుండటంతో ఏదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల సమస్యను తెలుసుకున్న మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి బుధవారం చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు, సమస్య పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్‌కేసర్‌ సర్కిల్‌ ఏదులాబాద్‌ డివిజన్‌లో ఉన్న లక్ష్మీనారాయణ చెరువులోకి వ్యర్థ రసాయనాలతో కూడిన కలుషిత నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో చెరువులో నీటిని శుద్ధి చేసేందుకు సుమారు రూ.35 లక్షలు ఖర్చు చేసి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ పనులు చేపట్టినట్లు వివరించారు. అయినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో కలుషిత నీరు చెరువులో కలవడంతో మళ్లీ చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో నీరు కలుషితం కావడంతో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను కూడా అందించడం లేదని మత్స్యకారులు తెలిపారు. దీంతో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారి సమస్యలపై స్పందించిన ఏనుగు సుదర్శన్‌రెడ్డి వెంటనే ఎంపీ ఈటల రాజేందర్‌కు వీడియో కాల్‌ ద్వారా పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెరువులోకి కలుషిత నీరు చేరడానికి గల కారణాలను గుర్తించి, నీటి నాణ్యతను పునరుద్ధరించి, బాధిత మత్స్యకారులకు న్యాయం చేయాలని ఏనుగు సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కోఆర్డినేషన్‌ సభ్యుడు కప్పర్గళ్ల కరుణాకర్‌, మేడ్చల్‌ రూరల్‌ జిల్లా మీడియా కన్వీనర్‌ చలవాది ప్రవీణ్‌రావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మెంగ రాజు, సీనియర్‌ నాయకులు రాచకట్ల శ్రీశైలం, గట్టుపల్లి మల్లేష్‌ ముదిరాజ్‌, పూస వెంకటేష్‌, బద్దం నాగరాజు, రాచకట్ల హరికృష్ణ, స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!