🔸అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనులు 91 శాతం పూర్తి
🔸డిసెంబర్ 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి.
🔸కొత్త ఏడాదిలో వైద్య సేవలు ప్రారంభిస్తాం:మంత్రి దామోదర రాజనర్సింహ
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : అల్వాల్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో కలిసి ఆయన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2023లో ప్రారంభించిన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు అప్పటికి కేవలం 14 శాతం మాత్రమే పూర్తయ్యాయని, ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అల్వాల్ ఆస్పత్రి నిర్మాణానికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు మిగిలిన పనులను డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిని మరింత వేగంగా ఎలా పూర్తి చేయాలనే అంశాలపై రెండు గంటలపాటు సమీక్షించినట్లు వెల్లడించారు.అల్వాల్ టిమ్స్‌ను న్యూరాలజీ, నెఫ్రాలాజి సహా పలు సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 36 విభాగాలతో 12 బ్రాడ్ స్పెషాలిటీ ,14 సూపర్ స్పెషాలిటీ ,7 సపోర్టింగ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో టిమ్స్‌లో 100 పడకలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ప్రధాన ఆసుపత్రి భవనంతోపాటు మెడికల్ హాస్టల్, నర్సింగ్ కళాశాల, నర్సింగ్ హాస్టల్, పరిపాలనా భవనం, పార్కింగ్, క్యాంటీన్ వంటి అదనపు నిర్మాణాల అవసరాన్ని గుర్తించినట్లు మంత్రి వివరించారు. వీటికి అదనపు నిధుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.కొత్త ఏడాదిలో అల్వాల్ టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, మరో రెండు నెలల్లో ఓపీ సేవలు ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా ఇన్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. అల్వాల్‌తోపాటు ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ ఆసుపత్రులను కూడా సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశం లో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రీస్తునాథ జన చంకు , డీఎంఈ, అదనపు డీఎంఈ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
