Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCరోడ్డుపై వరి నాట్లు.. మేడ్చల్ రోడ్ల...

రోడ్డుపై వరి నాట్లు.. మేడ్చల్ రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ వినూత్న నిరసన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

మేడ్చల్ పట్టణంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నుంచి గ్రంథాలయానికి వెళ్లే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో వర్షపు నీటితో ఏర్పడిన గుంతల్లో స్థానిక మహిళలతో కలిసి వరి నాట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత బాసురాది భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌లో విలీనం చేసిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. హౌజింగ్ బోర్డు కాలనీ, కేఎస్ఆర్ వెంచర్, కిందిబస్తీ, బాలాజీనగర్, ఉమానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని ఆరోపించారు. ఏసీపీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రి, పశువైద్యశాల, వ్యవసాయ శాఖ, పాస్‌పోర్ట్ కార్యాలయం, బాలికల పాఠశాల, రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇదేనని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన భాస్కర్ యాదవ్, మేడ్చల్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు దయానంద్ యాదవ్, నవీన్ రెడ్డి, విష్ణుచారి, నడికొప్పు నాగరాజు ముదిరాజ్, సందీప్ గౌడ్, శంకర్, పద్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!