🔸ట్రాన్స్‌జెండర్లకు జీడిమెట్ల పోలీసుల తీవ్ర హెచ్చరిక
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : షాపుల వద్దకు గుంపులుగా వెళ్లి వ్యాపారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జీడిమెట్ల పోలీసులు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులను హెచ్చరించారు. బాలాజీ లేఅవుట్, గాజులరామారంలో కొత్తగా ప్రారంభించిన ఓ బ్యూటీ సెలూన్ వద్ద డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే తమ కమ్యూనిటీ సభ్యులతో వచ్చి రగడ చేస్తామని బెదిరించిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లపై పోలీసులు ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సీఐ కె. రవికుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులతో ప్రత్యేక కౌన్సెలింగ్ సమావేశం నిర్వహించారు. షాపుల ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాలు, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో గుంపులుగా వెళ్లి వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవికుమార్ హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.

