ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు మహర్దశ పట్టనుంది. చెరువుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వజ్రెష్ యాదవ్ బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రధాన చెరువుల వివరాలను కమిషనర్‌కు అందజేశారు. బోడుప్పల్ రా చెరువు, చెంగిచెర్ల చింతల చెరువు, ఎదులాబాద్ చెరువు, రాంపల్లి సూర్యనారాయణ చెరువు, పీర్జాదిగూడ పెద్ద చెరువు తదితర చెరువుల ప్రస్తుత పరిస్థితి, ఆక్రమణలు, అభివృద్ధి అవసరాలను కమిషనర్‌కు వివరించారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలోని చెరువులను ఆక్రమణల నుంచి పరిరక్షించడంతో పాటు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, కట్టల బలోపేతం, నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని, సీఎం ఆదేశాల మేరకే హైడ్రా కమిషనర్‌ను కలిసి సమగ్ర వివరాలు అందజేసినట్లు పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధి పూర్తయితే వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని వజ్రెష్ యాదవ్ అన్నారు.
