ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాక్షేత్రంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్” లో భాగంగా నాగోల్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ 77వ వసంతంలోకి అడుగుపెట్టారని, గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు ఆయన అందించిన సేవలు దేశం గర్వపడేలా ఉన్నాయన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతజాతి మొత్తం మోదీని గౌరవిస్తోందని, ప్రపంచ చిత్రపటంలో దేశ ఔన్నత్యాన్ని పెంచారని కొనియాడారు. దేశం సొంత కాళ్లపై నిలబడిందని, మోడ్రన్ రైల్వే సిస్టం, ఎయిర్ పోర్టులు, వేల కిలోమీటర్ల జాతీయ రహదారులతో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. 2014 కంటే ముందు మౌలిక సదుపాయాలకు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు 15 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. “మోదీ ఎప్పుడూ తాను పాలకుడిని అనరు, సేవకుడిని మాత్రమే అంటారు. 76 ఏళ్ల వయసులో కూడా ఒక్కరోజు సెలవు లేకుండా యంత్రంలా పనిచేస్తున్నారు” అని అన్నారు. మోదీ మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్. గౌతం రావు, తుల్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండె గణేష్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
