🔸అధికారులకు డీఆర్ఓ మాలతి స్పష్టమైన ఆదేశాలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పెండింగ్‌లో ఉంచకుండా, నిబంధనల మేరకు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలతి అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 50 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వస్తున్న ప్రజల వినతులను అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై చేపట్టిన చర్యలు, పరిష్కార వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ మాలతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

