ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా : ఉత్తమ సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చొరవ చూపిన అలియాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్‌రెడ్డికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల సహకారంతో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టిన చర్యలను జిల్లా అధికారులు అభినందించారు. ముఖ్యంగా వనమహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడాన్ని ప్రశంసించారు.బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించడం, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించడం కూడా గుర్తింపునకు కారణమైంది. అలియాబాద్, మజీద్‌పూర్ ప్రాంతాల్లో డ్రైనేజీల శుభ్రత, పూడికతీత, పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. అలాగే వీధిలైట్ల సమస్యలను సత్వరం పరిష్కరిస్తూ, పనిచేయని లైట్లకు మరమ్మతులు చేయించడం, అవసరమైన చోట కొత్త లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడం, అధికారులు, సిబ్బందిని సమన్వయం చేయడంలో వెంకట్‌రెడ్డి చూపిన చొరవను జిల్లా అధికారులు అభినందించారు.కమిషనర్‌కు ప్రశంసా పత్రం లభించడంపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందించేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఉత్తమ సేవలకు కమిషనర్ వెంకట్‌రెడ్డికి ప్రశంసా పత్రం
RELATED ARTICLES
