ఆర్.జె.న్యూస్,ఆలియాబాద్ : దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ఆలియాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా జరిగిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, జాతీయ గీతాన్ని అందరూ కలిసి ఆలపించారు. పోలీసుల గౌరవ వందనంతో ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “స్వాతంత్ర్యం నిలబెట్టుకోవడమే కాకుండా, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం మనందరి కర్తవ్యం” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

