Saturday, August 29, 2026
Homeక్రైమ్ న్యూస్తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు

తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు

📰 Generate e-Paper Clip

🔸రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!

ఆర్.జె.న్యూస్, ఎల్బీనగర్‌ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంతో పాటు కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు చేపట్టారు. డీజీ అనుమతితో ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

🔸ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు

సోదాల్లో ఇప్పటివరకు ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. తుర్కయంజాల్‌లో మూడు, యాదగిరిగుట్టలో మూడు, హస్తినాపురంలో ఒకటి, విశ్వేశ్వరనగర్‌ కాలనీలో మరో ప్లాట్‌ ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో పది ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడైంది.

🔸కిలోన్నరకు పైగా బంగారం

శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో, బ్యాంకు లాకర్లలో కలిపి కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన కుమారుడి పేరుతో గ్లాస్‌మేట్‌ బార్‌లో రూ.86 లక్షల పెట్టుబడి ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

🔸అధికారిక లెక్క రూ.7 కోట్లు.. మార్కెట్‌ విలువ రూ.100 కోట్లు?

ఏసీబీ ప్రాథమిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని సమాచారం. మరిన్ని ఆస్తులు, నగదు, విలువైన వస్తువులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు.

🔸 లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలి

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!