ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో బాలసదనం పిల్లలతో రాఖీ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ప్రభుత్వ బాలసదనానికి చెందిన బాలబాలికలు జిల్లా కలెక్టర్ మను చౌదరికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ బాలసదనం పిల్లల కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి భోజనం చేసిన ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు స్వీట్లు, కొత్త దుస్తులను అందజేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి అవసరాలను తెలుసుకున్నారు.
🔸చదువు, ఆరోగ్యానికి అండగా
బాలసదనం పిల్లల చదువు, ఆరోగ్యం, సంక్షేమానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. విద్యాభ్యాసంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.కలెక్టర్కు చిన్నారులు రాఖీలు కట్టి, ఆయనతో కలిసి భోజనం చేయడంతో బాలసదనం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వీట్లు, కొత్త దుస్తులు అందుకోవడంతో పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద, బాలల భవన్ కోఆర్డినేటర్ తిరుమలాదేవి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్ రహీం తదితర అధికారులు పాల్గొన్నారు.

